KTR: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, డీకే అరుణలు ఓడిపోతారు: కేటీఆర్
- ప్రతిపక్షాలు ఎన్ని కూటములు కట్టినా ప్రజలు పట్టించుకోలేదు
- ఓటమి భయంతో రేవంత్ డ్రామాలు ఆడారు
- సీఎం అభ్యర్థులమని చెప్పుకున్నవారు కూడా రాహుల్ తో ప్రచారం చేయించుకున్నారు
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదయిందని... ప్రతిపక్షాలు ఎన్ని కూటములు కట్టినా ప్రజలు పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ దే గెలుపని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మహామహులకు కూడా ఓటమి తప్పదని అన్నారు. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఓడిపోతున్న వారి జాబితాలో ఉన్నారని జోస్యం చెప్పారు. హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానన్న రేవంత్ రెడ్డి... తనను చంపేస్తారంటూ చివరి రోజుల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారని, ఓటమి భయంతో డ్రామాలు ఆడారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకుంటున్న నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం కోసం రాహుల్ గాంధీని పిలిపించుకున్నారని కేటీఆర్ అన్నారు. స్టార్ క్యాంపెయినర్లమని చెప్పుకున్నవారికి కూడా మరో స్టార్ క్యాంపెయినర్ రావాల్సి వచ్చిందని సెటైర్ వేశారు. చంద్రబాబుతో ప్రజాకూటమికి తీవ్ర నష్టం జరిగిందని.. అందుకే చివరి రెండు రోజుల ప్రకటనల్లో చంద్రబాబు ఫొటోను కాంగ్రెస్ తొలగించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని... టీఆర్ఎస్ మాత్రం చాలా సంయమనంతో వ్యవహరించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా గెలవబోతోందని చెప్పారు.