India: భార్యకు వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఎన్నారై డాక్టర్.. వీసా, పాస్ పోర్టుతో అమెరికాకు జంప్!
- కర్ణాటకలోని బెంగళూరులో ఘటన
- భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ
- బెంగళూరులో వదిలేసి పరారైన భర్త
ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ కేంద్రం చట్టం తెచ్చినా, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు ప్రబుద్ధులు మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా భార్యతో గొడవ పడ్డ ఓ ఎన్నారై డాక్టర్.. ఆమెను ఎయిర్ పోర్టులో వదిలి అమెరికాకు పరారయ్యాడు. అక్కడితో ఆగకుండా వాట్సాప్ లో మూడుసార్లు ‘తలాక్’ అంటూ పంపాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరుకు చెందిన రేష్మా అజీజ్‌కు 2003లో ఇదే ప్రాంతానికి చెందిన డాక్టర్ జావేద్ ఖాన్‌తో వివాహం అయింది. అనంతరం ఈ జంట అమెరికాకు వలస వెళ్లింది. ఈ జంటకు ప్రస్తుతం 13 ఏళ్ల కూమార్తె, పదేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య పలు అంశాల్లో విభేదాలు తలెత్తాయి. దీంతో పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు ఇల్లినాయిస్ నుంచి బెంగళూరుకు తిరిగివచ్చారు. అయితే ముందుజాగ్రత్తగా ఆమె పాస్ పోర్టు, వీసాలను జావేద్ తీసేసుకున్నాడు. బెంగళూరులో దిగగానే ‘నువ్వు ఇంటికి వెళ్లు, నేను ఇప్పుడే వచ్చేస్తా అంటూ నమ్మబలికాడు. అనంతరం రిటర్న్ ఫ్లైట్ ఎక్కి అమెరికాకు చెక్కేశాడు.
ఆ తర్వాత రేష్మా ఫోన్ కు ‘తలాక్, తలాక్, తలాక్’ అంటూ మూడుసార్లు విడాకుల సందేశాన్ని పంపాడు. దీంతో హతాశురాలైన రేష్మా ఫోన్ చేయగా, అన్ని ఫోన్లను స్విచ్ఛాప్ చేసినట్లు సమాచారం వచ్చింది. అంతేకాకుండా ఇద్దరు చిన్నారులు ఎక్కడున్నారో తెలియకుండా దాచేశాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు..తనకు న్యాయం చేయాలని కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.