t-Telugudesam: ఈ అనుమానాలకు కారణం బీజేపీ, టీఆర్ఎస్ ప్రముఖులే: టీ-టీడీపీ అధికార ప్రతినిధి
- టీఆర్ఎస్ కు 60 సీట్లే వస్తాయని సర్వేలంటున్నాయి
- వంద సీట్లు ఖాయమని కేటీఆర్ ఎలా చెబుతారు?
- నాడు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడూ ఇదే పాట పాడారు!
ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతాయన్న అనుమానాలు తలెత్తడానికి కారణం, కేంద్రంలోని బీజేపీ పార్టీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రముఖులేనని టీ-టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ కు 60 సీట్లే వస్తాయని చెబుతుంటే.. ‘మాకు వంద సీట్లు ఖాయం’ అని కేటీఆర్ ఎందుకు పాటపాడుతున్నారని ప్రశ్నించారు.
నాడు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇదే రకమైన పాట పాడారని, అసలు, ఇలాంటి అపోహలు రేకెత్తించింది టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వమేనని విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల సంఘంపైనా ఆయన విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాలో చాలా మంది పేర్లు లేవని ప్రశ్నిస్తే, అందుకు, క్షమాపణలు చెప్పి రజత్ కుమార్ సరిపెట్టుకున్నారని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని తాను తప్పుబడుతున్నానని, ఇక్కడి ఎన్నికల సంఘం ద్వారా ఇదంతా చేయించిందని, ఇదంతా, బీజేపీ ఆడించిన నాటకమని ఆరోపించారు.