Australia: అడిలైడ్ టెస్టులో రికార్డుల మోత.. కోహ్లీ సేనపై ప్రశంసలు కురిపించిన షేన్ వార్న్!
- తొలి టెస్టులోనే కోహ్లీ సేన ఘనవిజయం
- మరే భారత జట్టుకు సాధ్యం కాని రికార్డు
- అరుదైన ఘనత సాధించిన రిషబ్ పంత్
విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆస్ట్రేలియాలో తొలి టెస్టులోనే ఘనవిజయం సాధించింది. తాజా విజయంతో 11 సంవత్సరాల తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో విజయం అందుకున్నట్లు అయింది.
కాగా, అడిలైడ్ మ్యాచ్ లో భారత జట్టు ఆస్ట్రేలియాపై 31 పరుగుల తేడాతో ఆసిస్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఒక్కో వికెట్ కు కనీసం 15 పరుగులు జోడించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు కూడా సరికొత్త రికార్డును సృష్టించింది. గత వందేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరోవైపు భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించాడు. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ లో 11 క్యాచ్ లను(తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ లో 5) అందుకోవడం ద్వారా ఇంగ్లండ్ క్రికెటర్ జాక్ రస్సెల్, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ రికార్డును పంత్ సమం చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో ఇరుజట్ల ఆటతీరుపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు.
అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించిందని కితాబిచ్చారు. అద్భుతంగా పోరాడి విజయం అందుకున్న విరాట్ కోహ్లీ సేనకు అభినందనలు తెలిపాడు. టెస్టు క్రికెట్ లో ఉండే అసలైన మజా ఇదేనని వ్యాఖ్యానించాడు. ఇదే పోరాటస్ఫూర్తిని పెర్త్ లోనూ ప్రదర్శించాలని ఇరు జట్లకు సూచించాడు. మరోవైపు అడిలైడ్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి రెండు ఇన్నింగ్స్ లో వరుసగా 123, 71 పరుగులు చేసిన పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.