Sivarajsingh Chawan: మధ్యప్రదేశ్ లో ఓడితే కనుక శివరాజ్ సింగ్ చవాన్ వ్యాఖ్యలే కారణం: బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- 'మా కీ లాల్' వంటి వ్యాఖ్యలపై ప్రజల ఆగ్రహం
- లేకుంటే మరో 15 సీట్లలో ముందుండేవాళ్లం
- అయినా గెలుస్తామన్న నమ్మకముందన్న రఘునందన్ శర్మ
మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరమైతే కనుక, అందుకు సీఎం శివరాజ్ సింగ్ చవాన్ వ్యాఖ్యలే కారణమవుతాయని ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రఘునందన్ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రజలకు నచ్చలేదని అన్నారు.
"సీఎం చవాన్ చేసిన 'మా కీ లాల్' వంటి వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన ప్రసంగాలు చప్పగా సాగాయి. లేకుంటే మేము అదనంగా మరో 10 నుంచి 15 సీట్లలో ముందుండేవాళ్లం. అనిశ్చితి ఉండదనే నేను భావిస్తున్నా. ఓడిపోతే మాత్రం ఆ తప్పు శివరాజ్ దే" అని ఆయన అన్నారు. పరిపాలనలో కూడా కొన్ని తప్పులు జరిగాయని, అయినప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అవాస్తవం కావచ్చని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గతంలో సాధించినన్ని సీట్లను సాధించలగమన్న నమ్మకం ఉందని చెప్పారు.