Anantapur District: కదిరి మండలం పట్నం మీదుగా కృష్ణమ్మ పరవళ్లు... చెర్లోపల్లి జలాశయానికి చేరిన నీరు
- కరవు నేల అనంతపురం జిల్లా వాసుల్లో ఆనందోత్సాహం
- నీటిని చూసేందుకు కాలువ వెంబడి బారులు తీరిన జనం
- బ్రాంచి కెనాల్లో ఎనిమిది పంపులతో లిఫ్టింగ్
జలం కోసం నిత్యం అల్లాడే రాయసీమ జనాల్లో ఆనందోత్సాహం.. తమ చెంత నుంచే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పట్టలేనంత సంతోషం. అనంతపురం జిల్లా కదిరి మండలంలో కనిపించిన దృశ్యమిది. తమ చెంతనుంచే ప్రవహిస్తున్న కృష్ణా జలాలను చూసేందుకు జనం కాలువల వెంట బారులు తీరారు.
కదిరి మండలం పట్నం గ్రామం వద్ద నుంచి ప్రారంభమయ్యే పుంగనూరు బ్రాంచి కెనాల్ నుంచి చెర్లోపల్లి జలాశయానికి ఈనీరు చేరుతోంది. 22 కిలోమీటర్ల దూరం ప్రవాహం కోసం బ్రాంచి కెనాల్‌పై ఎనిమిది పంపులను ఏర్పాటుచేసి రిజర్వాయర్‌లోకి నీటిని తోడుతున్నారు. బీడు భూముల్లో పారుతున్న జలాలను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్న జనం ఎక్కడికక్కడ పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌భాషా కృష్ణమ్మకు జలహారతినిచ్చారు. రిజర్వాయర్‌లోకి నీరు చేరిన చోట పూజలు చేసి గంగమ్మకు చీర సమర్పించారు.