USA: నమ్మకం కుదిరేవరకు పాకిస్థాన్ కు ఒక్క డాలర్ కూడా ఇచ్చేదిలేదు!: తేల్చి చెప్పిన అమెరికా
- టెర్రరిస్టుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న అమెరికా సైనికులు
- ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కృషి చేస్తోందని తేలితేనే సాయం
- ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ
ఉగ్రవాదులకు స్వర్గధామంగా పాకిస్థాన్ కొనసాగుతూనే ఉందని, టెర్రరిస్టుల వల్ల ఎందరో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇకపై పాకిస్థాన్ కు ఒక్క పైసా కూడా సాయం చేసేది లేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అరికట్టేలా కృషి చేస్తోందని తమకు నమ్మకం కలిగేంత వరకూ ఒక్క డాలర్ కూడా ఆ దేశానికి వెళ్లదని అన్నారు.
పాకిస్థాన్ వల్ల యూఎస్ కు నష్టం కలుగుతోందని ఆరోపించిన ఆమె, అటువంటి పాక్ కు సాయపడాల్సిన అవసరం లేదని అన్నారు. 'ది అట్లాంటిక్' మేగజైన్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పాకిస్థాన్ ను గుడ్డిగా నమ్మి నిధులు ఇవ్వబోమని, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుని, ఆశించిన ఫలితాలు వస్తున్నాయని నమ్మిన తరువాతే నిధులు ఇస్తే మంచిదని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. కాగా, గత సెప్టెంబర్ లో పాకిస్థాన్ కు అమెరికా 300 బిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.