Andhra Pradesh: తెలంగాణలో జరిగినట్లే ఏపీలోనూ ఓట్ల మిస్సింగ్ జరగబోతోంది.. జనసేన నేత రావెల సంచలన వ్యాఖ్యలు!
- జనసేన మద్దతుదారుల్ని లక్ష్యంగా చేసుకున్నారు
- ఓట్లను తొలగించేందుకు ఏజెన్సీని పెట్టుకున్నారు
- పవన్ కల్యాణ్ తెల్లకాగితం లాంటివారు
ఏపీ మాజీ మంత్రి, జనసేన నేత రావెల కిశోర్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. జనసేన మద్దతుదారుల ఓట్లను ఓ కుట్ర ప్రకారం తొలగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్రైవేటు ఏజెన్సీని సైతం నియమించుకుందని మండిపడ్డారు. తెలంగాణలో జరిగినట్లే ఏపీలోనూ ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలపై జనసేన కార్యకర్తలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏలూరులో జనసేన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీలో కుల వివక్ష, స్వార్థ రాజకీయాలను తట్టుకోలేకే తాను బయటకు వచ్చానని రావెల కిశోర్ బాబు తెలిపారు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే జనసేనలో చేరినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో భారీగా నగదును వెదజల్లి అధికారంలోకి రావాలని టీడీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెల్లకాగితం లాంటివారని ప్రశంసించారు. పవన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని ప్రకటించారు.