Praja Kutami: ఎవరు విజేతలు?: లగడపాటి రాజగోపాలా? జాతీయ చానళ్లా?
- ప్రజా కూటమి గెలుస్తుందన్న లగడపాటి
- టీఆర్ఎస్ దే అధికారమన్న జాతీయ చానళ్లు
- మేజిక్ ఫిగర్ కీలకం
తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంటుందని జాతీయ మీడియా చానళ్లు, అది జరగదు, ప్రజాకూటమి గెలుస్తుందని గత ఎన్నికల్లో ఎన్నో విశ్వసనీయ ఫలితాలు ఇచ్చిన లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎవరు విజయం సాధిస్తారన్న సంగతి కూడా కొన్ని గంటల్లో తేలిపోతుంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లుండగా, మేజిక్ ఫిగర్ 60 సీట్లన్న సంగతి తెలిసిందే.
ఇక లగడపాటి తన టీమ్ సర్వే తరువాత, టీఆర్ఎస్ కు 35 సీట్లు, ప్రజా కూటమికి 65 సీట్లు (పది సీట్లు అటూఇటుగా), బీజేపీకి 7, ఇతరులకు 14 (ఎంఐఎంతో కలిపి) వస్తాయని చెప్పారు. ఇక జాతీయ సంస్థల విషయానికి వస్తే టైమ్స్ నౌ టీఆర్ఎస్ 66, కూటమికి 37, బీజేపీకి 7, ఇతరులకు 9 సీట్లు వస్తాయని చెప్పింది. ఎన్డీటీవీ టీఆర్ఎస్ కు 69, కూటమికి 37, బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు వస్తాయని చెప్పింది.
ఇక సీఎన్ఎక్స్ సంస్థ టీఆర్ఎస్ కు 70, కూటమికి 32, బీజేపీకి 4, ఇతరులకు 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ విషయానికి వస్తే టీఆర్ఎస్ కు 62 నుంచి 70, కూటమికి 32 నుంచి 38, బీజేపీకి 6 నుంచి 8, ఇతరులకు 6 నుంచి 8 సీట్లు రావచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎవరి సర్వే నిజమవుతుందన్న విషయం మరికాసేపట్లో వెల్లడికానుంది.