Counting: కౌంటింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు!
- కౌంటింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు
- తెలంగాణలో 43 కౌంటింగ్ కేంద్రాలు
- మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తికాగా, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 లెక్కింపు కేంద్రాలు ప్రత్యేక భద్రతా దళాల అధీనంలోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్ లో 13 కేంద్రాలతో పాటు, 31 జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరికాసేపట్లో పోస్టల్ బ్యాలెట్లు, ఆపై ఈవీఎంలను తెరవనున్నారు.
మొత్తం 2,379 రౌండ్లలో ఓట్లను లెక్కించనుండగా, అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు సాగనుంది. అత్యల్పంగా భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఫలితం వెల్లడికానుంది. మొత్తం 40 వేల మందికిపైగా సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దా 144 సెక్షన్ విధించారు.
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెంట్రల్ ఫోర్స్, తెలంగాణ పోలీసులు, ఆర్మ్ డ్ ఫోర్స్, సివిల్ పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై కౌంటింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు. ఒక్కో కౌంటింగ్ సెంటర్ కు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులను ఈసీ నియమించింది.