Telangana: చరిత్ర సృష్టించిన హరీశ్ రావు.. 1.20 లక్షల ఓట్ల మెజారిటీతో సరికొత్త రికార్డు!
- సిద్ధిపేట నుంచి పోటీచేసిన టీఆర్ఎస్ నేత
- ఏఐఎంఐఎం రికార్డును బద్దలు చేసిన హరీశ్
- సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చరిత్ర సృష్టించారు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీశ్.. 1,20,650 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించారు. తద్వారా గతంలో మరెవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును నెలకొల్పారు. 1998లో ఉమ్మడి ఏపీలో గొట్టిపాటి నర్సయ్య 1.04 లక్షల మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ఏఐఎంఐఎం అభ్యర్థి 2004లో చార్మినార్ నుంచి 1.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది కొత్త రికార్డును నెలకొల్పారు. తాజా విజయంతో హరీశ్ రావు ఆ రికార్డులు అన్నింటిని తిరగరాశారు. కాగా, హరీశ్ రావు గెలుపుతో సిద్ధిపేటలో టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నాయి. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం స్వీట్లు తినిపించుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు.