Telangana: కేసీఆర్ కు ఫోన్ చేసిన వైఎస్ జగన్, మమతా బెనర్జీ, కుమారస్వామి!
- 48 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్
- ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు
- అభినందనలు తెలిపిన రాజకీయ నేతలు
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన మెజారిటీ దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఇప్పటికే 48 చోట్ల ఘనవిజయం సాధించగా, మరో 40 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పలువురు నేతలు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, బిహార్ సీఎం నితీశ్ కుమార్, శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కూటమిలో చేరేందుకు మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ స్టాలిన్ లతో భేటీ అవుతామన్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు టీఆర్ఎస్ అధినేతను ఫోన్ లో అభినందించారు.