congress: మూడు రాష్ట్రాల్లో మా విజయం ప్రజల విజయమే: రాహుల్ గాంధీ
- ఈ ఫలితాలు మోదీపై ప్రజల అభిప్రాయానికి నిదర్శనం
- బీజేపీ పాలనలో ఎవరి కలలూ నెరవేరడం లేదు
- తెలంగాణలో మంచి ఫలితాలే ఆశించాం కానీ రాలేదు
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించామని, కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ప్రజల విజయంగా భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేటి ఎన్నికల ఫలితాలు మోదీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని స్పష్టం చేశాయని అన్నారు. బీజేపీ పాలనలో ఎవరి కలలూ నెరవేరడం లేదన్న విషయం ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని అన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరలేదని, ఆయన పాలన పట్ల రైతులు కూడా అసంతృప్తితో ఉన్నారని, మోదీ అమలు చేసిన జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ విజన్ తో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. మిజోరాం, తెలంగాణలో గెలిచిన పార్టీలకు ఆయన అభినందనలు తెలిపారు. తమ పార్టీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు. తెలంగాణలో మంచి ఫలితాలే ఆశించాం కానీ, తమకు దక్కలేదని వ్యాఖ్యానించారు.
ఈవీఎంలలో సమస్య అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్య అని, ఈవీఎంలకు అడుగుభాగంలో ఉండే చిప్ ను మ్యానిపులేట్ చేయొచ్చని, ఈ విధానాన్ని రద్దు చేసి బ్యాలెట్ పద్ధతి అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బీజేపీ పాలనలో అవినీతి, నిరుద్యోగ సమస్య, రైతుల కష్టాలు పెరిగాయని, బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైందని విమర్శించారు.