Congress: ఓడిపోవడం బాధ కలిగించింది... ఇందులో టీడీపీ తప్పేం లేదు: జానారెడ్డి
- ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించక పోవడం ఆశ్చర్యం కలిగించింది
- అధికారంలోకి రావాలన్న బలమైన ఆకాంక్ష నెరవేరలేదని ఆవేదన
- టీఆర్ఎస్ అనైతిక పద్ధతుల్లో గెలిచిందన్న కుంతియా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకుని అధికారాన్ని అప్పగిస్తారని భావిస్తే ప్రజలు ఓడించడం కొంత బాధ కలిగించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. ఆయన విలేరులతో మాట్లాడుతూ ఈ ఓటమికి తెలుగుదేశం పార్టీ చేరికే కారణమన్న వ్యాఖ్యలను ఆయన కొట్టివేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని, కూటమి ఏర్పాటు కారణంగా తప్పు జరిగిందని తాను భావించడం లేదని చెప్పారు.
ఓటమిపై అంశాల వారీగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అధికారాన్ని నిలబెట్టుకున్న కేసీఆర్ కు, గెలిచిన ఇతర ఎమ్మెల్యేలకు జానారెడ్డి అభినందనలు తెలిపారు. అయితే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు గ్రామాల్లో విచ్చల విడిగా డబ్బు పంపిణీ చేసి కేసీఆర్ అనైతిక పద్ధతుల్లో గెలిచారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో వారి వాహనాల్లోనే డబ్బు తరలించారని విమర్శించారు.