kcr: చిన్న విషయాలను కూడా కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంటోంది: కేసీఆర్
- రాష్ట్రాల పరిస్థితులు దిగజారుతున్నాయి
- రాష్ట్రాల అధికారాలను దెబ్బతీస్తున్నాయి
- మోదీ సహకార ఫెడరలిజం ఆచరణలో ఎక్కడా లేదు
రాష్ట్రాల పరిస్థితులు దిగజారుతున్నాయని, చిన్న విషయాలను కూడా కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంటోందని చాలా పార్టీలు అభిప్రాయపడుతున్నాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాల అధికారాలను దెబ్బతీస్తున్నాయని, మోదీ సహకార ఫెడరలిజం అని ప్రచారం చేశారని, ఆచరణలో ఎక్కడా అది అమలు జరగలేదని విమర్శించారు.
దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయం విధానాలు అవసరమని, రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. అనేక దేశాలు రైతులకు పూర్తిగా సహకరిస్తున్నాయని, మన దేశంలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ మన వ్యవసాయం ముందుకు సాగడం లేదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇవన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ పద్ధతులు పోవాలని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని, వాటిని ఖతం చేసి దేశానికి కొత్త ట్రెండ్ చూపించాలని, ఆ ప్రయత్నం తాను చేస్తానని చెబుతున్నానని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసిన ప్రభుత్వం తమదేనని, మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా అమలు చేశామని చెప్పారు. నాలుగు సంవత్సరాల ఆచరణను ప్రజలు విశ్వసించారని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.