National book fair: 15 నుంచి హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం
- ఎన్టీఆర్ స్టేడియంలోని తెలంగాణ కళాభారతి వేదిక
- తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం పుస్తకం స్టాళ్లు
- ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉప రాష్ట్రపతి
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న తెలంగాణ కళాభారతిలో శనివారం నుంచి 32వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురు చూసే పుస్తక మేళాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం పుస్తకాలు కొలువుదీరనున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థల పుస్తకాల స్టాళ్లు ఈసారి ప్రదర్శనలో ఉంచనున్నట్లు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ చెబుతున్నారు.
ఈ పుస్తక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరై ప్రదర్శన ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో 331 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమీతోపాటు తెలుగు యూనివర్సిటీ, తెలుగు అకాడమీ బుక్స్ కూడా అందుబాటులో ఉంటాయని బుక్‌ఫెయిర్ సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తెలిపారు.
ఈనెల 25వ తేదీ వరకు జరిగే పుస్తక ప్రదర్శనలో ప్రతిరోజూ ‘సాహిత్య సమాలోచన’ పేరుతో సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు బుక్‌ఫెయిర్‌లో బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.