modi: పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ, రాహుల్.. అయినా మాటల్లేవ్!
- పార్లమెంటుపై దాడి సందర్భంగా ప్రాణాలు కోల్పోయినవారి సంస్మరణ కార్యక్రమం
- మన్మోహన్ ను పలకరించిన మోదీ
- రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన విజయ్ గోయల్, రాందాస్ అథవాలే
పార్లమెంటులో దగ్గరగానే ఉన్నప్పటికీ ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలు ఒకరినొకరు పలకరించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారి సంస్మరణ కార్యక్రమం సందర్భంగా ఇరువురు నేతలు ఒక చోటే ఉన్నారు. అయినా, ఒకరినొకరు చూసుకోలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మాత్రం మోదీ పలకరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు విజయ్ గోయల్, రాందాస్ అథవాలేలు మాత్రం రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తదితరులు హాజరయ్యారు.
2001 డిసెంబర్ 13న సాయుధులైన ఐదుగురు ముష్కరులు పార్లమెంటుపై దాడి చేసి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్, ఇద్దరు పార్లమెంటు సిబ్బంది, ఒక తోటమాలి, ఒక కెమెరామెన్ ప్రాణాలు కోల్పోయారు.