Telangana: ఎన్నికల్లో గెలవగానే హీరోలు అయిపోరు.. టీఆర్ఎస్ విజయంపై స్పందించిన ఏపీ మంత్రి పితాని!
- వైసీపీ, జనసేన కనీసం పోటీచేయలేక పోయాయి
- టీడీపీ తరఫున చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు
- బీజేపీ లేదా కాంగ్రెస్ తో కలవక తప్పదు
ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఎవరూ హీరోలు అయిపోరని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నేతల తలరాతలు, గెలుపోటములు నిర్ణయించాల్సింది ప్రజలేనని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి(ప్రజాకూటమి) తీవ్ర పరాభవం నేపథ్యంలో మంత్రి పితాని ఈ మేరకు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆంధ్రాలోకి రావొద్దని తాము ఎన్నడూ చెప్పలేదని గుర్తుచేశారు. తెలంగాణలో టీడీపీకి ప్రచారం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని తెలిపారు. ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఉమ్మడి ఏపీ నుంచి పోటీ చేశారనీ, మాజీ ప్రధాని వీపీ నరసింహారావు కర్ణాటక నుంచి పోటీ పడ్డారని గుర్తుచేశారు.
చంద్రబాబు తెలంగాణలో టీడీపీ తరఫున ప్రచారం చేస్తే.. కొందరు నేతలు మాత్రం పార్టీలు పెట్టుకుని కూడా ప్రచారం చేయలేకపోయారని ప్రతిపక్ష వైసీపీ, జనసేనలను దెప్పిపొడిచారు. ఏపీలో కుర్చీలు, ఆఫీసులు కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ఏపీ కోసం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీతో చేతులు కలపక తప్పదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరివల్ల ఎవరు నష్టపోయారో ఇప్పుడే చెప్పలేమన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి ముందుకు పోతామనీ, ఏపీ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.