Narendra Modi: మోదీ పర్యటనల ఖర్చు... అక్షరాలా రూ. 2,012 కోట్లు!
- పార్లమెంట్ కు తెలిపిన కేంద్ర మంత్రి వీకే సింగ్
- మొత్తం 84 పర్యటనలు చేసిన మోదీ
- విమానాల నిర్వహణకే రూ. 1,583 కోట్లు
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, గడచిన నాలుగున్నరేళ్లలో ఆయన విదేశీ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ. 2,012 కోట్లు. ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రశ్నోత్తరాల వేళ, ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన 84 పర్యటనలు చేశారని చెప్పారు.
ఎయిరిండియా వన్ విమానాల నిర్వహణతో సహా సురక్షిత హాట్ లైన్ సౌకర్యాలు, తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేశామని, విమానాల నిర్వహణకే రూ. 1,583 కోట్లు ఖర్చయిందని వీకే సింగ్ వెల్లడించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, పలు ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత ప్రాబల్యాన్ని పెంచేందుకు ఈ పర్యటనలు సహకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సహా ఎన్నో దేశాల అధినేతలతో నరేంద్ర మోదీ పలుమార్లు సమావేశం అయ్యారు.