india odisa: ముఖ్యమంత్రి పక్కనే కూర్చుని మ్యాచ్ చూసిన 30 మంది మాజీ నక్సలైట్లు!
- ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఘటన
- మాజీ నక్సల్స్ తో కలిసి సీఎం పట్నాయక్ మ్యాచ్ వీక్షణ
- హర్షం వ్యక్తం చేసిన మాజీ నక్సలైట్లు
సాధారణంగా లొంగిపోయిన నక్సల్స్, మావోయిస్టులకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయడంతో పాటు పునరావాసం కల్పిస్తూ ఉంటాయి. అయినా చాలామంది ఈ కొత్త జీవితానికి అలవాటు పడేందుకు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా మాజీ మావోయిస్టుల్లో ఉన్న ఈ ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుకొచ్చారు.
ఇందుకు రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం వేదికయింది. ఈ స్టేడియంలో దాదాపు 30 మంది మాజీ నక్సల్స్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కలిసి భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య హాకీ మ్యాచ్ ను వీక్షించారు. సీఎంతో కలిసి మ్యాచ్ చూసినవారిలో 16 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు.
ఇటీవల లొంగిపోయిన నక్సల్స్ తమకు హాకీ మ్యాచ్ చూడాలని ఉందని మల్కాన్‌గిరి ఎస్పీకి చెప్పారు. రంగంలోకి దిగిన అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే కళింగ స్టేడియంలో తాము ముఖ్యమంత్రి పక్కన కూర్చుని మ్యాచ్ చూడబోతున్నామని వారికి తెలియదు. చివరికి ఈ విషయం తెలుసుకున్న మాజీ నక్సల్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
ఈ సందర్భంగా ఓ నక్సల్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేము నిజంగా జనజీవన స్రవంతిలో కలిశామని భావిస్తున్నాం. లొంగిపోయిన నక్సల్స్‌కు ఒడిశా ప్రభుత్వం చాలా తోడ్పాటు అందిస్తోంది’ అని తెలిపారు.
As a touching gesture, CM @Naveen_Odisha watched #INDvNED match of #HWC2018 at #KalingaStadium with 30 #Maoists surrendered cadre including 16 women from #Malkangiri. They thanked the CM for the opportunity and for truly mainstreaming their lives #NaveenTransformsLives pic.twitter.com/N7hl0znDuU
— CMO Odisha (@CMO_Odisha) December 13, 2018