Congress: సబితా ఇంద్రారెడ్డికి కీలక పదవి అప్పగించే యోచనలో అధిష్ఠానం!
- ఎన్నికల్లో ఉద్దండులైన నాయకుల ఓటమి
- ఓడిపోయిన జానారెడ్డి, రేవంత్, పొన్నాల
- సీఎల్పీ బాధ్యతలు సబితకు అప్పగించే అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండులైన నాయకులు ఓటమిపాలు కాగా, 99 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి ఎందరో పేరున్న నేతలు ఓడిపోగా, ఇప్పుడు అసెంబ్లీలో విపక్ష నేత పదవి ఎవరికి దక్కుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో కృషి చేయడంతో పాటు తాను పోటీ చేసిన మహేశ్వరం నుంచి విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డికి సీఎల్పీ నేత బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు ఆమెను బలపరుస్తుండటం, గతంలో హోమ్ శాఖ బాధ్యతల్లో ఉండటం సబితా ఇంద్రారెడ్డికి అనుకూలాంశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విజయం సాధించినప్పటికీ, ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో, విపక్ష నేత పదవిని మరొకరికి అప్పగించాలన్న కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డి పేరు వినిపిస్తోంది.