congress: కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: కన్నా లక్ష్మీనారాయణ
- బీజేపీ, మోదీపై బురదజల్లేందుకు చంద్రబాబు చూశారు
- రాఫెల్ వ్యవహారంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు
- కాంగ్రెస్, టీడీపీలపై మండిపడ్డ కన్నా
ఫ్రాన్స్ తో రాఫెల్ డీల్ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి ఏ విధమైన సహేతుక కారణాలూ కనిపించడం లేదని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.
రాఫెల్ కుంభకోణం దర్యాప్తు జరగకుండా ఉండేందుకు సీబీఐ చీఫ్ అలోక్ వర్మను పక్కన పెట్టారని, ఈ కుంభకోణంతో మోదీకి సంబంధం ఉందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కన్నా ప్రస్తావించారు. దేశ రక్షణ విషయంలో కూడా రాజకీయ లబ్ధి కోసం, బీజేపీ మీద, మోదీ మీద బురదజల్లేందుకు చంద్రబాబు చూశారని ఆరోపించారు. రాఫెల్ వ్యవహారంపై తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.