praja kutami: కూటమి ఏర్పాటు విషయంలో జాతీయ నాయకులను ఉత్తమ్ తప్పుదోవ పట్టించారు: గజ్జెల కాంతం
- తెలంగాణ ఎన్నికల్లో కూటమి ఘోరంగా ఓడింది
- టీ-పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాలి
- టీజేఎస్ ను కూటమిలో ఎందుకు కలుపుకున్నారు?
ప్రజాకూటమి ఏర్పాటు విషయంలో జాతీయ నాయకులను ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుదోవ పట్టించారని టీ-కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి ఘోరంగా ఓటమిపాలైతే టీ-పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సింది పోయి మీటింగ్ ఎలా పెడతావని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్యమకారుడు కానందునే ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా టీజేఎస్, కోదండరామ్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సూచించిన మనిషి కోదండరామ్ అని, ఆయన స్థాపించిన టీజేఎస్ ను కూటమిలో ఎందుకు కలుపుకున్నారని విమర్శించారు. ఉద్యమకారులను, దళిత నాయకులను కించపరిచిన ఉత్తమ్, తన పదవులకు రాజీనామా చేయాలని, ఆ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.