Telangana election commission: పోలీసులు, పోలింగ్ అధికారులు కుమ్మక్కై రిగ్గింగ్ చేశారు: టీ- కాంగ్రెస్ నేతల ఆరోపణ
- పదవీ విరమణ పొందిన అధికారులు ఈసీలో ఎందుకు?
- లోపాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తాం
- ఈసీ అధికారులు టీఆర్ఎస్ ఇచ్చే జీతాలు తీసుకుంటున్నారా?
తెలంగాణలో ప్రజాకూటమి ఓటమిపై కాంగ్రెస్ నేతలు సమీక్షించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన ఈ సమీక్షకు టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల కమిషన్ అధికారులు టీఆర్ఎస్ ఇస్తున్న జీతాలు తీసుకొని పనిచేస్తున్నారని, పదవీ విరమణ పొందిన అధికారులను ఎన్నికల సంఘంలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని, ఇరవై లక్షల ఓట్లు తొలగించారని, తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. లోపాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తామని, ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలీసులు, పోలింగ్ అధికారులు కుమ్మక్కై రిగ్గింగ్ చేశారని ఆరోపించారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు 70 శాతం ఉన్న పోలింగ్ ఒక గంటలోనే 90 శాతానికి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఎక్కడెక్కడ చిప్స్ పెట్టి ట్యాంపరింగ్ చేశారో అధ్యయనం చేశామని, ఈవీఎంల ట్యాంపరింగ్ పై రేపు డెమో చూపిస్తామని, బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని దాసోజ్ శ్రవణ్ పేర్కొన్నారు.