localbody elections: కోర్టు విధించిన గడువులోగా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి
- రాష్ట్రవ్యాప్తంగా 12,751 పంచాయతీలు
- జనవరి 10లోగా రెండు లేదా మూడు విడతల్లో పూర్తి
- బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నివేదిక ఇవ్వగానే నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలోని 12,751 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, కోర్టు విధించిన గడువులోగానే ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డి స్పష్టం చేశారు. బీసీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వం అందజేసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను మరికొందరు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
జిల్లా పరిషత్ స్ట్రాంగ్ రూంలో నిల్వ ఉంచిన బ్యాలెట్ పత్రాల గోదాములను, పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జనవరి 10వ తేదీలోగా ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ ప్రక్రియ కూడా ముగిసిందన్నారు. అయితే సాధారణ ఎన్నికల కారణంగా వీరిలో కొందరు ఉద్యోగులు బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, వీరి స్థానంలో కొత్తవారిని నియమించి మరోసారి శిక్షణ అందజేస్తామని తెలిపారు.