Telangana: 100 సీట్లలో బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందని ముందుగానే చెప్పా.. అంచనా అస్సలు తప్పలేదు!: కేటీఆర్
- ఆ పార్టీకి 100 చోట్ల డిపాజిట్ కూడా రాదన్నా
- అదే ఇప్పుడు నిజమయింది
- తెలంగాణ ప్రజల రుణాన్ని తీర్చుకుంటాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలు, యువత, మహిళలు, విద్యావంతులు.. ఇలా అందరూ టీఆర్ఎస్ వైపే నిలబడ్డారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 2 కోట్ల మంది ఓటింగ్ హక్కు వినియోగించుకోగా, టీఆర్ఎస్ కు 98 లక్షల ఓట్లు దక్కాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమికి తమకు మధ్య 42 లక్షల ఓట్ల తేడా ఉందని వెల్లడించారు. మహాకూటమికి 28-29 శాతం ఓట్లు లభిస్తే, టీఆర్ఎస్ కు ఏకంగా 47 శాతం ఓట్లు దక్కాయని పేర్కొన్నారు.
88 స్థానాల్లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటామనీ, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు. బీజేపీ తెలంగాణలో 100 సీట్లలో డిపాజిట్ కోల్పోతుందంటే కొందరు మీడియా మిత్రులు నమ్మలేదనీ, ఇప్పుడేమో ఏకంగా 103 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయని వ్యాఖ్యానించారు.