gurajala: రూ.600 కోట్లు కాదు.. రూ.60 లక్షలున్నట్లు నిరూపించండి చాలు!: గురజాల ఎమ్మెల్యే యరపతినేని
- నిరూపించిన వారికే ఆస్తులన్నీ రాసిచ్చేస్తానని వైసీపీకి సవాల్
- కళ్లున్న వారికే అభివృద్ధి కనిపిస్తుందని వ్యాఖ్య
- తన ఆస్తుల వివరాలన్నీ ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నాయని వెల్లడి
తన ఆస్తుల వివరాలన్నీ ఆదాయ పన్ను శాఖ అధికారుల వద్ద ఉన్నాయని, రూ.600 కోట్లు కాదు, రూ.60 లక్షలు ఉన్నాయని నిరూపించినా వాటన్నింటినీ నిరూపించిన వారికి రాసిచ్చేస్తానని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సవాల్ విసిరారు. పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.
కళ్లున్న వారికి తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుందని, అవిలేని వారికి అవినీతే దర్శనమిస్తుందని ధ్వజమెత్తి, కాసు మహేశ్వరరెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినీతి సొమ్ము వెనకేసుకోవడానికి తన తండ్రి, తాతలు సీఎంగా పనిచేయలేదన్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరో తెలుసునని అన్నారు.
నరసరావుపేటలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడి అక్కడ అవకాశం లేకపోవడంతో, ఇక్కడ వైసీపీ తరపున పోటీ చేసే వారు కరువై గురజాల వచ్చిన విషయం గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. పల్నాడులో పది మందికి కూడా మేలు చేయని వారు భయపెడితే భయపడి పోవడానికి తానేమీ వారి కింద ఉద్యోగిని కానని హెచ్చరించారు. మహేశ్వరరెడ్డిని పార్ట్‌టైం ఉద్యోగిగా అభివర్ణించారు. పల్నాటి పౌరుషం గుండె నిండా నింపుకొని ఉన్నవాడు యరపతినేని అన్నారు.