Narendra Modi: మోదీ గారూ.. హెచ్1బీ సమస్యను పరిష్కరించండి!: ప్రధానికి పవన్ కల్యాణ్ లేఖ

  • అమెరికాలో పర్యటిస్తున్న జనసేనాని
  • వేర్వేరు వర్గాలతో వరుస సమావేశాలు
  • ప్రధాని కార్యాలయానికి బహిరంగ లేఖ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన భేటీ అవుతున్నారు. తాజాగా అగ్రరాజ్యంలో ఉన్న తెలుగువారితో సమావేశమైన పవన్ కల్యాణ్, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అందించే హెచ్1బీ వీసాల జారీ నిబంధనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినతరం చేసిన విషయాన్ని పవన్ కల్యాణ్ కు అక్కడి తెలుగు ప్రజలు గుర్తుచేశారు. తాజా నిర్ణయంతో చాలామంది భారతీయులు ముఖ్యంగా తెలుగువారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనసేనాని ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేదోడువాదోడుగా నిలుస్తున్న భారత సంతతి ప్రజల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందని అందులో తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల కారణంగా వీరంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. స్వేచ్ఛాయుత మార్కెట్, స్వయంకృషి, నవకల్పనకు కేంద్రంగా మారిన అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను ఆకర్షించిందనీ, భారతీయులు కూడా ఇలాగే ఈ దేశానికి వలస వచ్చారని వ్యాఖ్యానించారు.

కానీ ఇప్పుడు నిబంధనల మేరకు ఓ బారతీయ సంతతి వ్యక్తి అమెరికా గ్రీన్ కార్డు పొందడానికి 150 ఏళ్లు పడుతుందన్నారు. తమ పిల్లలు అమెరికాలో పుట్టడంతో వారిని అక్కడే వదిలేసి వీళ్లంతా భారత్ కు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందుల నుంచి భారతీయులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పవన్ స్పష్టం చేశారు. హెచ్1బీ వీసా విషయంలో నిబంధనలు సరళతరం చేసేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చించాలని కోరారు. ఈ మేరకు జనసేనాని ప్రధాని మోదీ కార్యాలయానికి రెండు పేజీల బహిరంగ లేఖను రాశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News