USA: ‘ఇడియట్’ అని గూగుల్ లో కొట్టగానే ట్రంప్ ఫొటో ఎందుకు వస్తుందంటే.. వివరణ ఇచ్చిన సీఈవో సుందర్ పిచాయ్!

  • నోటీసులు జారీచేసిన ప్రతినిధుల సభ
  • విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • జ్యుడీషియరీ కమిటీకి పిచాయ్ వివరణ

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో బగ్స్ కారణంగా చిత్రవిచిత్రమైన ఫలితాలు వస్తుంటాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ లో ఇడియట్ అని టైప్ చేస్తే ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో అమెరికా ప్రతినిధుల సభ గూగుల్ కు నోటీసులు జారీచేసింది. తమముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన జో లాఫ్గ్రెన్ స్పందిస్తూ..‘గూగుల్ లో ఇడియట్ అని టైప్ చేయగానే ట్రంప్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. గూగుల్ రాజకీయ వివక్ష పాటిస్తోందా? ఇలా ఎందుకు జరుగుతుందో చెబుతారా?’ అని ప్రశ్నించారు. దీంతో సుందర్ పిచాయ్ జవాబిస్తూ.. సాధారణంగా గూగుల్ సెర్చ్ ఫలితాల్లో కంపెనీ కల్పించుకోదన్నారు.

ఇంటర్నెట్ లో ఉండే కోట్లాది వ్యాసాలు, కథనాలు, వీడియోలను విశ్లేషించిన మీదట గూగుల్ తనకు తానుగా ఈ ఫలితాలను అందిస్తుంది. ఇంటర్నెట్ లో ఎక్కుమంది వెతికిన, చూసిన అంశాలను, ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న విషయాలను చూపుతుంది. అంతేతప్ప ఇందులో మానవప్రమేయం ఎంతమాత్రం ఉండదు’ అని స్పష్టం చేశారు. గతంలో భారత్ లో పప్పు ఎవరు? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఫొటోలు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News