vice president: శరీరానికి వ్యాయామం ఎంతో మెదడుకి పుస్తకం అంత!: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- హైదరాబాద్ బుక్ ఫెయిర్ ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
- భాషాభివృద్ధికి, భావాభివృద్ధికి పుస్తక మహోత్సవాలు
- పుస్తక సరస్వతి కటాక్షం ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరికీ అందుతుంది
‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు సాయంత్రం ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 32వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, పుస్తక మహోత్సవాలు భాషాభివృద్ధికి, భావాభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. పుస్తకాలు ఏ ఒక్క కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతానికో, భాషకో పరిమితం కావని అన్నారు. లక్ష్మీ కటాక్షం సంగతి ఎలా ఉన్నా, పుస్తక సరస్వతి కటాక్షం ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరికీ అందుతుందని, సరస్వతీ దేవికి పేదాగొప్పా అన్నా తేడా లేదని అన్నారు.
శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, మెదడుని చైతన్యం చేయడానికి పుస్తకాలు అంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈరోజు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన దేశంలో రెండో స్థానంలో ఉందని, కోల్ కతా తొలి స్థానం ఆక్రమించిందని అన్నారు. కోల్ కతా తొలి స్థానం ఆక్రమించడానికి కారణం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పుస్తకాలు కొనుగోలు చేసి రాష్ట్ర గ్రంథాలయాలు, విద్యాలయాలకు అందిస్తుందని, దీనికితోడు బెంగాలీలు సాహిత్య ప్రియులని అన్నారు. అలాంటి సహాయసహకారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి కూడా అందితే, తొలి స్థానాన్ని ఆక్రమించవచ్చని అన్నారు.