TRS: కేంద్రాన్ని యాచించకుండా శాసించి మన హక్కులను సాధించుకోవాలి: కేటీఆర్
- మొత్తం 16 ఎంపీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ను గెలిపించాలి
- కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదు
- ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో ‘తెలంగాణ’ నిర్ణయించాలి
తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం కేంద్రాన్ని యాచించకుండా శాసించి సాధించుకోవాలంటే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గట్టి బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని, ఈ రెండు పార్టీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదని, ఈ విషయమై పార్లమెంట్ లో నిలదీద్దామంటే మనకు సంఖ్యాబలం లేకుండా పోయిందని, అదే కనుక మనకు తగినంత మంది ఎంపీలు ఉంటే మన హక్కులను పోరాడి సాధించుకోవచ్చని అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీలు అధికారంలో ఉంటే తెలంగాణకు ఒరిగేదేమీలేదని, కేంద్రంలో మనం నిర్ణయాత్మక పాత్రలో ఉంటేనే మన హక్కులు, నిధులు సాధించుకోవచ్చని.. బంగారు తెలంగాణను నిర్మించుకోవచ్చని అన్నారు. ఖమ్మంతో సహా 16 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి, ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో తెలంగాణ రాష్ట్రం నిర్ణయించే దిశగా సమాయత్తమవుదామని కేటీఆర్ విజ్ఞప్తి నిచ్చారు.