Hyderabad: వణుకుతున్న హైదరాబాద్ వాసులు.. పంజా విసురుతున్న చలి
- నాలుగు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రత
- తెలంగాణపై ద్రోణి ప్రభావం
- చలికి తోడైన శీతల పవనాలు
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ వాసులు వణుకుతున్నారు. చలి పులి పంజా విసురుతోంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కూడా తెలంగాణపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
నాలుగు రోజుల క్రితం 32 డిగ్రీలుగా నమోదైన పగటి ఉష్ణోగ్రత ఇప్పుడు 25 డిగ్రీలకు పడిపోయింది. సాధారణం కంటే కూడా 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. ఫలితంగా చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి శీతల గాలులు కూడా తోడవడంతో జనాలు వణికిపోతున్నారు. తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా రాత్రి వేళ చలి తీవ్రంగా ఉంటోంది. నగరంలో మరో వారం రోజులపాటు చలి తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.