karimnagar train: కరీంనగర్-తిరుపతి రైలు ఇకపై మరో రెండు రోజులు అదనంగా తిరుగుతుంది!
- ఇప్పటి వరకు గురువారం, ఆదివారం అందుబాటులోకి
- ఇకపై నాలుగు రోజులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
- త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్నట్లు వెల్లడి
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పరిసరాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. కరీంనగర్-తిరుపతి మధ్య ఇప్పటి వరకు గురువారం, ఆదివారం రోజుల్లో వారానికి రెండురోజులు మాత్రమే తిరుగుతున్న రైలు మరో రెండు రోజులు అదనంగా అందుబాటులోకి రానుందని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు.
సికింద్రాబాద్ రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ గుప్తాతో సమావేశమైన అనంతరం రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ప్రయాణికుల రద్దీతో పాటు, కరీంనగర్ ప్రజల కోరిక మేరకు వారానికి నాలుగు రోజుపాటు రైలు నడిపేందుకు రైల్వేశాఖ అంగీకరించిందని, త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనున్నట్లు వివరించారు.
అలాగే కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లి లెవల్ క్రాసింగ్ వద్ద రూ.102 కోట్లతో ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సైతం బోర్డు అనుమతిచ్చిందని తెలిపారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారని తెలిపారు.