Andhra Pradesh: నాకు మహా బద్ధకం.. అన్నీ బాగుంటే ఇంట్లో నుంచి బయటకే రాను!: పవన్ కల్యాణ్

  • పిల్లలు భవిష్యత్ లో ఇబ్బందులు పడకూడదు
  • ఆత్మసాక్షికి జవాబు చెప్పుకోవడానికి రాజకీయాల్లోకి
  • డల్లాస్ ప్రవాస గర్జనలో జనసేనాని వెల్లడి

తాను పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్ తరాలకు ఉండకూడదన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయాల్లోకి వెళతానంటే తన తల్లి ఎందుకురా? అని ప్రశ్నించారనీ, అందుకు తాను స్పందిస్తూ..‘ఇప్పుడున్న వ్యవస్థ భవిష్యత్ లో మరింత అధ్వానంగా మారి, నాకు 60-70 ఏళ్ల వయసులో నిస్సహాయ స్థితిలో బాధపడకూడదని రాజకీయాల్లోకి వచ్చా. ఆత్మసాక్షికి జవాబు చెప్పుకునేందుకు వచ్చాను’ అని జవాబిచ్చినట్లు వెల్లడించారు.

ఓ దేశ సంపద నదులు, ఖనిజాల్లో ఉండదనీ, ఏ దేశానికైనా యువతే నిజమైన సంపద అని వ్యాఖ్యానించారు. అమెరికాలోని డల్లాస్ లో ఈరోజు జరిగిన జనసేన ‘ప్రవాస గర్జన’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. మరింత మెరుగైన జీవితం, భవిష్యత్ కలలు సాధించుకోవడానికే చాలామంది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అమెరికాకు వచ్చారని పవన్ తెలిపారు.

ప్రవాస భారతీయులు నిజమైన జాతి సంపద అని వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నుంచి ఎక్కడో డల్లాస్ లో ఉండే రవి వరకూ అందరూ మనోడే అన్న భావన భారతీయులందరికి ఉంటుందన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా కుంగిపోకుండా అమెరికాలో సంపాదిస్తూ స్వదేశానికి డబ్బులు పంపిస్తున్న మీరు నిజమైన హీరోలని పవన్ అన్నారు. ప్రవాస తెలుగువారిని కాపాడుకునే బాధ్యత జనసేనపై ఉందని వ్యాఖ్యానించారు. తనకు ఇంట్లో నుంచి రావడమే బద్ధకమనీ, అన్నీ బాగుంటే ఇంట్లో నుంచి బయటకే రానని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News