BRITAIN: దొంగలకు ఉద్యోగమిస్తాం.. గంటకు జీతం రూ.5,000!: బ్రిటన్ షాపు విచిత్ర ప్రకటన
- చోరీలను అరికట్టేందుకు కొత్తరూటు
- దొంగల ద్వారా షాపుల భద్రత పటిష్టం
- బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్రిటన్ షాపు
సాధారణంగా దొంగతనాలను అరికట్టాలంటే షాపు యజమానులు గట్టి సెక్యూరిటీ వ్యవస్థను, సిబ్బందిని నియమించుకుంటారు. కానీ బ్రిటన్ కు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ షాపులో దొంగతనాలు చేయడానికి అనుభవమున్న దొంగలు కావాలని ప్రకటన ఇచ్చింది. కేవలం దొంగతనాలు చేయడమే కాకుండా, అది ఎలా చేశారో చెబితే గంటకు రూ.5 వేలు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ముచ్చట బ్రిటన్ లో చోటుచేసుకుంది.
బ్రిటన్ లోని ఓ షాపుకు చెందిన ప్రతినిధి బార్క్.డామ్ వెబ్ సైట్ లో ఈ ప్రకటన ఇచ్చారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ షాపులో విపరీతంగా దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని ఆమె తెలిపారు. దీంతో వాటిని అరికట్టేందుకు నిపుణులైన చోరుల్ని నియమించుకోవాలని నిర్ణయించామన్నారు. వీరు చోరీలు చేయడంతో పాటు వస్తువులను ఎలా దొంగలించారన్న విషయాన్ని చెప్పాల్సి ఉంటుందన్నారు.
ఇందుకోసం గంటకు రూ.5,000 చెల్లిస్తామని ప్రకటించారు. వారి సలహాలు, సూచనలతో షాపులో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. అంతేకాకుండా దొంగలించిన వస్తువుల్లో మూడింటిని ఉచితంగా తీసుకెళ్లవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు. 2013లో ప్రారంభించిన తమ షాపుల్లో విపరీతంగా చోరీలు జరుగుతున్నాయనీ, ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.