IMD: వేగాన్ని పెంచుకున్న పెథాయ్... 48 గంటలు గడిచేదెలా?: కృష్ణా జిల్లా వాసుల భయం!
- గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వస్తున్న తుపాన్
- ప్రస్తుతం మచిలీపట్నానికి 500 కి.మీ. దూరంలో పెథాయ్
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు
ఈ ఉదయం వరకూ గంటకు 17 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరం వైపు వస్తున్న పెథాయ్, తన వేగాన్ని మరింతగా పెంచుకుంది. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెథాయ్ వేగం 25 కిలోమీటర్లుగా ఉందని, ఇది రేపటిలోగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను, మరింతగా బలపడుతోందని అధికారులు హెచ్చరించారు. వచ్చే 48 గంటలూ కృష్ణా జిల్లాకు అత్యంత కీలకమని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.
కాగా, ఇప్పటికే తుపాను తీరం దాటుతుందని భావిస్తున్న మచిలీపట్నం ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తుపాను మరికాస్త దగ్గరకు వచ్చిన తరువాత, ఎక్కడ తీరం దాటుతుందో తెలుసుకుని, ఆయా ప్రాంతాలకు గంట వ్యవధిలోనే చేరుకుని, సహాయక చర్యల్లో నిమగ్నమవుతామని కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది.