Murder: "నువ్వంటే ఇష్టం... కారు పంపిస్తా రా" అంటే నమ్మి వెళ్లి విగతజీవుడైన రాజమండ్రి యువకుడు.. ఘటన వెనుక భార్య వివాహేతర బంధం!

  • ఓ వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్న జ్యోతి
  • భర్తను చంపించాలని ప్రియుడితో కలసి ప్లాన్
  • సహకరించిన మరో మహిళ నాగదేవి
  • ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

భార్య వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడిని వదిలి ఉండలేని ఓ మహిళ, భర్త అడ్డును తొలగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసి, ఈ నెల 4న హత్య చేయించగా, పోలీసులు, ఎంతో శ్రమించి, కేసులో చిక్కుముడిని విప్పారు. రాజమహేంద్రవరం అర్బన్‌ డీఎస్పీ రాజారావు వెల్లడించిన వివరాల ప్రకారం, కడియం మండలానికి చెందిన గుబ్బల వెంకటరమణ (35)ను కొందరు దారుణంగా హత్య చేయగా, పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో వెల్లడైన నిజాలను చూసి విస్తుపోయారు.

గుబ్బల వెంకటరమణ, జ్యోతి దంపతులు. జ్యోతి ఏడాదిగా, ఓ నర్సరీలో గుమాస్తాగా పని చేస్తున్న సతీష్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటుండగా, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇద్దరినీ పిలిపించి మందలించారు. ఇద్దరినీ కలవకుండా చేశారు. దీంతో వెంకటరమణపై కక్ష పెంచుకున్న సతీష్, జ్యోతితో కలసి అతని హత్యకు ప్లాన్ వేశాడు. తనకు గతంలో పరిచయమున్న నాగదేవి అనే మహిళను రంగంలోకి దించారు.

తమ ప్లాన్ లో భాగంగా కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసి, నాగదేవితో వెంకటరమణకు ఫోన్ చేయించాడు. "నువ్వంటే నాకిష్టం. నిన్ను చూడాలని ఉంది. నేను కారు పంపిస్తాను. ఎక్కి రా, నేను ఉన్న చోటుకు డ్రైవర్ నిన్ను తీసుకు వస్తాడు" అంటూ ఫోన్‌ లో ఆమె మాట్లాడగా, నమ్మిన వెంకటరమణ కారెక్కాడు.

అతన్ని ఓ కొబ్బరి తోటకు తీసుకెళ్లి, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన వ్యక్తులతో కలసి సతీష్ దాడి చేశాడు. కర్రలు, బీరు సీసాలు, చైన్లతో దారుణంగా కొట్టి, ఆపై మెడ నరికి, మృతదేహాన్ని తుప్పల్లో దాచి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి మృతదేహాన్ని పూడ్చి పెట్టే ఉద్దేశంతో తిరుగుతుండగా, తోట యజమాని దుర్గాప్రసాద్‌ చూసి, సతీష్‌ ను నిలదీశాడు. దీంతో విషయం చెప్పి పారిపోయాడు. దుర్గాప్రసాద్ ఇచ్చిన సమాచారంతో కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితులు జ్యోతి, నాగదేవి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News