stalin: ప్రధాని అభ్యర్థి ఈయనే... తమిళనాడు గడ్డపై నుంచి నేను ప్రతిపాదిస్తున్నా: స్టాలిన్
- ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరును ప్రతిపాదిస్తున్నా
- మోదీ అరాచక పాలనను అంతమొందించే శక్తిసామర్థ్యాలు రాహుల్ కు ఉన్నాయి
- మోదీకి మరో అవకాశం ఇస్తే.. దేశం 50 ఏళ్ల వెనక్కు వెళ్తుంది
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరును మహాకూటమి ప్రధాని అభ్యర్థిగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రతిపాదించారు. చెన్నైలో జరిగిన దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, తమిళనాడు గడ్డపై నుంచి పీఎం అభ్యర్థిగా రాహుల్ పేరును తాను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. మోదీ అరాచక పాలనను అంతమొందించే శక్తిసామర్థ్యాలు రాహుల్ కు ఉన్నాయని తెలిపారు.
ఐదేళ్ల మోదీ పాలనలో దేశం 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని... ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే దేశం 50 ఏళ్ల వెనక్కి వెళ్తుందని చెప్పారు. ఒక రాజులా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణం వల్లే దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం అందరం ఒక చోటుకు చేరుకున్నామని చెప్పారు.