Telangana: ఎన్నికలకు ముందు పార్టీ మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై దృష్టి పెట్టిన కేసీఆర్!
- కాంగ్రెస్ లోకి ఫిరాయించిన నలుగురు
- వారిపై అనర్హత వేటు వేయించనున్న కేసీఆర్
- నేడు స్వామిగౌడ్ కు వినతిపత్రం ఇవ్వనున్న విప్ ల బృందం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డి, కొండా మురళి, రాములునాయక్ లపై కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయించేందుకు పావులు కదుపుతున్న ఆయన, నేడు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు వినతి పత్రాన్ని అందించాలని ఆదేశించారు. మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని విప్ ల బృందం నేడు స్వామిగౌడ్ ను కలిసి, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరనుంది.
కాగా, వీరిలో భూపతిరెడ్డి కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే. కొండా మురళి వరంగల్, భూపతిరెడ్డి నిజామాబాద్ జిల్లాల స్థానిక సంస్థల నుంచి మండలికి ఎన్నికవగా, యాదవరెడ్డి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. రాములునాయక్ కు గవర్నర్ కోటాలో స్థానం లభించింది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన రాములు నాయక్ పై అనర్హత వేటు వేసేందుకు కొన్ని సాంకేతిక కారణాలు అవరోధంగా నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.