KTR: కేటీఆర్ కు పట్టాభిషేకం... కేరింతలు కొట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!
- బంగారు తెలంగాణ అతిత్వరలోనే వస్తుంది
- టీఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి'
- బాధ్యతలు స్వీకరించిన తరువాత కేటీఆర్
బంగారు తెలంగాణను సాధించుకోవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను మరోసారి గెలిపించిన ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండేందుకు కృషి చేస్తానని కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, భారీ సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
టీఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి' అని కొత్త నిర్వచనాన్ని చెప్పిన ఆయన, గడచిన ఎన్నికల్లో పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కలనూ నిజం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తాను హామీ ఇస్తానని చెప్పారు. పార్టీని మరో పాతిక సంవత్సరాలు అజేయ శక్తిగా నిలిపేందుకు తనకు ప్రజల నుంచి ఆశీర్వాదం కావాలని కోరారు.
ప్రతి కులానికి, మతానికి చెందిన పేదలకు తాను అండగా ఉంటానని, తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తానని చెప్పారు. తన తండ్రి, రాష్ట్ర పెద్ద కేసీఆర్ తనపై చాలా బాధ్యతను ఉంచారని, దాన్ని సక్రమంగా నెరవేర్చేందుకు ప్రాణమున్నంత వరకూ కృషి చేస్తానని కేటీఆర్ తెలిపారు. మరో వందేళ్లు టీఆర్ఎస్ పార్టీ ప్రజల సేవలో నిమగ్నమయ్యేందుకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని ఇచ్చినంతకాలం కృషి చేస్తానని అన్నారు.
అన్ని జిల్లాలు, మండలాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేస్తామని, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని కేటీఆర్ తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో హైదరాబాద్, బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12, నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి.