Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణస్వీకారం
- కమల్ నాథ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
- రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసిన కమల్ నాథ్
- రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కమల్ నాథ్ తో ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, రైతుల రుణమాఫీపై కమల్ నాథ్ తొలి సంతకం చేశారు. దీంతో, మధ్యప్రదేశ్ లో తాము అధికారంలోకొస్తే రుణమాఫీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నట్టయింది. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ జరగనుంది.
కాగా, భోపాల్ లో జరిగిన కమల్ నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సభా వేదికపై కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింథియాల మధ్యలో నిలబడ్డ చౌహాన్, నవ్వుతూ ప్రజలకు అభివాదం చేశారు.