Kurnool District: లంచం కోసం రైతు కుటుంబం భిక్షాటన.. కర్నూలులో హాట్ టాపిక్
- భూమి సమస్యను పరిష్కరించమంటే లంచం అడిగిన అధికారులు
- భార్యాపిల్లలతో లంచం కోసం భిక్షాటన
- లంచం అడగలేదన్న తహసీల్దార్
ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చేందుకు ఓ రైతు భిక్షాటన చేశాడు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లుకు చెందిన పొలం కబ్జాకు గురైంది. దీంతో తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ గత ఆరు నెలలుగా ఆయన తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, లంచం ఇస్తేనే పని అవుతుందని అధికారులు చెప్పడంతో నివ్వెరపోయాడు.
అధికారుల తీరుతోపాటు, తన బాధను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వెంకటేశ్వర్లు నిరసన చేపట్టాడు. సోమవారం భార్యాపిల్లలతో కలిసి వెలుగోడు చేరుకుని ‘‘లంచం ఇవ్వాలి ధర్మం చేయండి’’ అని ఫ్లెక్సీలు పట్టుకుని నిరాహార దీక్ష చేపట్టాడు. తన భూమి కబ్జాకు గురైందని, తమకు ప్రాణ హాని ఉందని ఫ్లెక్సీల్లో రాసిన వెంకటేశ్వర్లు తమను పట్టించుకుని న్యాయం చేయాలని కోరాడు. లంచం కోసం భిక్షాటన చేస్తుండడం వెలుగోడులో చర్చనీయాంశమైంది. రైతు దీక్షపై తహసీల్దార్ మాట్లాడుతూ వెంకటేశ్వర్లును ఎవరూ లంచం అడగలేదని వివరణ ఇచ్చారు.