Andhra Pradesh: చింతమనేని-టోల్ ప్లాజా వివాదంలో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత!
- చింతమనేనిని అడ్డుకున్న టోల్ ప్లాజా సిబ్బంది
- ఎమ్మెల్యేను అని చెప్పినా వినిపించుకోని వైనం
- కోపంతో కారును వదిలేసి బస్సు ఎక్కిన చింతమనేని
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టోల్ ప్లాజా సిబ్బంది మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. తన కారును గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారని చింతమనేని ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సు ఎక్కి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన చింతమనేని, తన కారును నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని తాను చెప్పినా టోల్ ప్లాజా సిబ్బంది వినిపించుకోలేదని వాపోయారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వెళుతున్న కారును కాజా టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. టోల్ ఫీజు చెల్లించాకే ముందుకు కదలాలని వారు స్పష్టం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనయిన చింతమనేని కారును అక్కడే వదిలేసి బస్సు ఎక్కి వెళ్లిపోయారు. తాజాగా ఆయన మంగళగిరి పోలీసులకు టోల్ సిబ్బంది వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు.