Andhra Pradesh: తప్పంతా చింతమనేని ప్రభాకర్ దే.. పోలీస్ కేసుపై స్పందించిన టోల్ ప్లాజా సిబ్బంది!
- స్టిక్కర్ లేకుండా కారులో వచ్చారు
- ముఖం కనిపించకుండా మఫ్లర్ కట్టుకున్నారు
- ఆయన్ను చూడగానే వెళ్లాలని కోరాం
గుంటూరు జిల్లాలో కాజా టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కారును సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. టోల్ ఫీజును కట్టాలని చెప్పడంతో ఆగ్రహానికి లోనయిన చింతమనేని కారును అక్కడే వదిలివెళ్లిపోయారు. అంతేకాకుండా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు టోల్ ప్లాజా సిబ్బందిపై ఆయన ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వివాదంపై కాజా టోల్ ప్లాజా సిబ్బంది స్పందించారు.
ఈ వివాదంలో తప్పంతా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దేనని వారు స్పష్టం చేశారు. చింతమనేని కారుకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ లేకుండా రావడంతో తొలుత వాహనాన్ని అడ్డుకున్నామని తెలిపారు. చలి కారణంగా తలకు మఫ్లర్ చుట్టుకుని ఉండటంతో చింతమనేనిని గుర్తుపట్టలేకపోయామని వెల్లడించారు. చివరికి ఆయన మఫ్లర్ తీయగానే గేటు తీసి వెళ్లాల్సిందిగా కోరామని పేర్కొన్నారు. అయినా ఈ విషయాన్ని చింతమనేని వివాదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ తప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు.