Andhra Pradesh: పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు నిరశన దీక్ష.. నారా లోకేశ్ స్పందన!
- హోదా, విభజన హామీల అమలుకు ఆందోళన
- సంఘీభావం తెలిపిన టీడీపీ ఎంపీలు
- కేంద్రం వ్యవహారశైలిపై లోకేశ్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలనీ, విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకూ నిరశన చేపడతానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు గల్లా జయదేవ్, మురళీ మోహన్ రామ్మోహన్ నాయుడికి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. తాజాగా రామ్మోహన్ నాయుడు నిరశన దీక్షపై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగిన రామ్మోహన్ నాయుడికి తనతో పాటు 5 కోట్ల మంది ఆంధ్రా ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని లోకేశ్ అన్నారు. కేంద్రం పొగరుబోతుతనానికి, తెలుగువాళ్ల మధ్య అనైక్యతకు నిరసనగా ఆయన దీక్షకు దిగారని వ్యాఖ్యానించారు. తన పుట్టినరోజు నాడు కూడా రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనకు దిగారని తెలిపారు.
కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్రం కుంటి సాకులు చెబుతోందని మంత్రి విమర్శించారు. 2014 విభజన చట్టం హామీలను కేంద్రం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.