Hyderabad: హైదరాబాదులో గాంధీభవన్ ముట్టడికి బీజేపీ యత్నం.. పలువురు నేతల అరెస్టు!
- రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ పార్టీవి అసత్య ఆరోపణలు
- రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి
- కనీసం ఒక్క రుజువున్నా బయటపెట్టాలి: కిషన్ రెడ్డి
హైదరాబాద్ లోని గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాఫెల్ డీల్ పై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా గాంధీభవన్ కు బయలు దేరిన సమయంలో గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగాలనుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని వారు మానుకోవాలని డిమాండ్ చేశారు. పచ్చ కామెర్ల వారికి అంతా పచ్చగా ఎలా కనిపిస్తుందో, అవినీతి కుంభకోణంలో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి కూడా అన్నీ అవినీతిమయంగా కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు.
బట్ట కాల్చి మొహం మీద వేసే ప్రయత్నం, అబద్ధపు ప్రచారం, విష ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ కుంభకోణానికి సంబంధించి ఒక్క రుజువు ఉన్నా బయటపెట్టాలని, సుప్రీంకోర్టు, సీబీఐ, విజిలెన్స్, కాగ్ లేదా కనీసం మీడియా ముందు ఆ రుజువును ఉంచాలని డిమాండ్ చేశారు. ‘రాఫెల్’పై ఇన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క ఆధారం కూడా బయటపెట్టకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.