ipl-12: ఐపీఎల్-12 వేలం..జాక్ పాట్ కొట్టిన ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి
- జైపూర్ వేదికగా కొనసాగుతున్న ఐపీఎల్ వేలం
- ఆటగాళ్ల కొనుగోలుకు పోటీపడుతున్న ఫ్రాంచైజీలు
- రూ.8.4 కోట్లతో ఉనాద్కట్ ను సొంతం చేసుకున్న రాజస్థాన్ జట్టు
ఐపీఎల్-12 సీజన్ కోసం ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ వేలం పాట ప్రక్రియ కొనసాగుతోంది. 2019 సీజన్ కు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి 70 మందిని లీగ్ లోని 8 జట్లు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో పేసర్ ఉనాద్కట్ ను రూ.8.4 కోట్లతో రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది.
ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి కనీస ధర రూ.50 లక్షలు ఉండగా రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేయడంతో జాక్ పాట్ కొట్టాడు. ఇషాంత్ శర్మను రూ.1.1 కోట్లకు, అక్షర్ పటేల్ ను రూ.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, మలింగను రూ.2 కోట్లకు ముంబై ఇండియన్స్, హెన్రిక్స్ ను కోటి రూపాయలకు పంజాబ్ జట్టు, వరుణ్ అరోరన్ ను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, జానీ బైర్ స్టోను ని రూ.2.2 కోట్లకు సన్ రైజర్స్, కార్లోస్ బ్రాత్ వైట్ ను రూ.5 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), హెట్మెయిర్ ను రూ.4.20 కోట్లతో ఆర్సీబీ కొనుగోలు చేశాయి.
మరోపక్క, యువరాజ్ సింగ్ పై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. కాగా, వచ్చే ఏడాది మే నుంచి వన్డే ప్రపంచ కప్ ఉన్నందున, ఐపీఎల్-12 మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగియనుంది.