Telangana: లగడపాటి మోసం చేశారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు!
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు లగడపాటి సర్వే
- ఓటర్లను ప్రలోభ పెట్టారంటున్న టీఆర్ఎస్ నేత
- రజత్ కుమార్ కు ఫిర్యాదు చేసిన వెంకట రమణారెడ్డి
తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి, సర్వే ఫలితాలంటూ లగడపాటి మీడియా సమావేశాలు పెట్టారని, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టారని చెబుతూ, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేత సత్తు వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు నుంచి ఆయన వరుసగా మీడియా సమావేశాలు పెట్టి, కుట్రపూరిత రాజకీయాలు చేశారని ఆయన ఆరోపించారు.
ఆయన చేసిన ప్రకటనలు ఓటర్లను ప్రలోభపెట్టేలా, మభ్యపెట్టేలా ఉండటంతో ఇతర అభ్యర్థులపై ప్రభావం పడిందని తానిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలను గందరగోళ పరిచేందుకు, తాననుకున్న వారికి ఓటేసేలా బ్లాక్ మెయిల్ చేసేందుకు లగడపాటి ప్రయత్నించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చెప్పిన సర్వేలు పూర్తిగా అవాస్తవమని తేలిందని, ఓట్ల లెక్కింపు తరువాత, ఆయన ప్రకటించిన వారిలో ఎవరూ గెలవలేదని వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు.