Pakistan: ఉద్వేగం...సంతోషం.. పాక్ జైలు నుంచి విడుదలై వచ్చిన హమీద్ నిహాల్ అన్సారీ!
- పాకిస్థాన్ నుంచి ఆరేళ్ల తర్వాత విడుదలై సరిహద్దు దాటి వచ్చిన నిహాల్
- పరిచయమైన యువతి కోసం అక్రమంగా పాక్‌లోకి ప్రవేశం
- గూఢచారిగా అనుమానించి నిర్బంధించిన దాయాది దేశం
ఉబికి వస్తున్న కన్నీటిని ఆ తల్లి రెప్పలమాటున దాచుకోలేకపోయింది. ఆరేళ్ల తర్వాత కొడుకుని చూడగానే ఆమె మాతృహృదయం భావోద్వేగానికి గురైంది. గుండె నిండా ఆనందం కన్నీటి రూపంలో బయటపడుతుంటే ఆమె తన ఆనందక్షణాలను కొడుకుతో పంచుకుంటూ మురిసిపోయింది. మాతృభూమికి కృతజ్ఞతలు తెలుపుకొంది.
ముంబయికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హమీద్ నిహాల్ అన్సారీ (33) ఎట్టకేలకు పాక్ చెర నుంచి బయటపడ్డాడు. మంగళవారం సాయంత్రం అత్తారి-వాఘా సరిహద్దు వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అతనికి భారత్ అధికారులు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా కొడుకును చూడగానే అతని తల్లి ఫౌజియా భావోద్వేగం పొందింది. మాసిన గెడ్డం, నెత్తిన టోపీ, కళ్లద్దాలతో సరిహద్దులోకి ప్రవేశించిన హమీద్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు మాతృభూమిని ముద్దాడి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
ఆన్లైన్లో పరిచయమైన ఓ పాకిస్థానీ అమ్మాయిని కలుసుకునేందుకు 2012లో హమీద్ నిహాల్ అన్సారీ పాకిస్థాన్‌లోకి అనధికారికంగా ప్రవేశించాడు. ఇతన్ని గూఢచారిగా అనుమానించిన నిఘావర్గాలు నిర్బంధించాయి. ఈ విషయం అక్కడి పాత్రికేయులు బయటపెట్టడంతో విషయం వెలుగుచూసింది. హమీద్ ఆచూకీ కోసం నిహాల్ తల్లి ఫౌజియా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖుచేశారు. దీంతో నిహాల్ భారత్ గూడచారి అని, తమ దేశ వ్యతిరేక నేరాలకు, పత్రాల ఫోర్జరీకి పాల్పడుతూ తమకు చిక్కాడని, సైనిక కోర్టు అతన్ని విచారిస్తోందని పాకిస్థాన్ సైన్యం బయటపెట్టింది.
విచారణ అనంతరం 2015లో సైనిక న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ 2012 నుంచి తమ నిర్బంధంలో ఉన్న కాలాన్ని పాకిస్థాన్ సైన్యం పట్టించుకోలేదు. దీంతో మొత్తం ఆరేళ్లపాటు నిహాల్ జైలులో ఉన్నాడు. సైనిక న్యాయస్థానం విధించిన శిక్ష పెషావర్ కేంద్ర కారాగారంలో ఈనెల 15వ తేదీతో పూర్తయింది. అయితే న్యాయపరమైన పత్రాలు అందలేదని చెప్పి మంగళవారం వరకు విడుదల చేయలేదు.