Andhra Pradesh: 2019 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తా.. అందరూ సిద్ధంగా ఉండండి!: సీఎం చంద్రబాబు
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి
- టీడీపీకి నిజమైన బలం కార్యకర్తలే
- అమరావతిలో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ విజయానికి తొలుత క్షేతస్థాయిలో పనిచేసేది కార్యకర్తలేనని వ్యాఖ్యానించారు. అమరావతిలో మంత్రులు, నియోజకవర్గాల ఇన్ చార్జీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్టీలో భేషజాలకు పోవద్దనీ, పార్టీలో గ్రూపులు కట్టవద్దని చంద్రబాబు సూచించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యత పెరిగే దిశగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ప్రభుత్వ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
దేశం మొత్తం మోదీ పాలనను తిరస్కరిస్తోందని చంద్రబాబు అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో బీజేపీ అందుకే చిత్తుగా ఓడిపోయిందన్నారు. ఏపీ మినహా దేశమంతా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలోని మైనారిటీల్లో తీవ్రమైన అభద్రతాభావం నెలకొందని పేర్కొన్నారు.